విశాఖ గర్జన పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా ఈనెల 15వ తేదీన విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు విశాఖ గర్జన పోస్టర్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విడుదల చేశారు. విశాఖ గర్జనకు వైస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది.

ఈ సందర్భంగా విశాఖ గర్జనను ఆవిష్కరించిన అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ గర్జనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖ గర్జనకు పిలుపునివ్వగానే పవన్‌ కల్యాణ్‌ నిద్రలేచాడని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ఏర్పాటు చేసిన రోజే పవన్‌ కల్యాణ్‌ మీటింగ్‌ పెట్టుకోవడం అవసరమా..? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు.

విశాఖ గ‌ర్జ‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. వికేంద్రీక‌ర‌ణే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. విశాఖ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.