కాళేశ్వరం మొదటి పంప్ ట్రయల్ రన్ సక్సెస్

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. దీనిపై ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించిన మినిస్టర్ కేటీఆర్ కు ఇది గిఫ్ట్ అంటున్నారు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు.

మంగళవారం ఉదయం 7 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటా రెడ్డి, ఎంఆర్‌కేఈఆర్, డ‌బ్ల్యూపీఎల్ ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూసారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.