నేడు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యనారాయణ..నిన్న ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్​నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరపనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్​ సోమేశ్​కుమార్​కు సీఎం కేసీఆర్​ ఆదేశాలిచ్చారు. కైకాల మృతదేహానికి శుక్రవారం కేసీఆర్ నివాళులర్పించారు. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినీ రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు.

1935 జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల.. ‘సిపాయి కూతురు’ సినిమాతో తొలిసారి మెరిశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్​బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా మూడు తరాల హీరోల సినిమాల్లో నటించారు. 777 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నారు.