స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు – రాజయ్య ఫై కడియం ఫైర్

స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం రాజయ్య కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎప్పటికీ తన అడ్డా అని.. అక్కడ ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. అంతే కాదు కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 361 మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారని, ఒక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంత మంది చనిపోయారని రాజయ్య అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు. స్టేషన్ ఘనపూర్‌ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు గుప్పించారు. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే రాజయ్య, దేశంలో బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం ఘనత ఆయనదే. రాజయ్య తప్పు చేస్తూ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడు. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అన్ని మూసుకొని ఉంటున్నాను. మోసం చేసే అలవాటు, వెన్నుపోటు పొడిచే ఉద్దేశం నాకు లేదన్నారు.

స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా’ అని తీవ్ర విమర్శలు చేసారు.