రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR's Maharashtra tour canceled
CM KCR

వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం స్ప‌ష్టం చేశారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇదిలా ఉంటే రేపు బుధవారం (ఆగస్టు 31) కేసీఆర్ బీహార్ కు వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్లనున్న సీఎం కేసీఆర్.. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో భేటీ అవుతారు. ఆయనతో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఇరువురూ కలిసి లంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కాగా, చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందించనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్… బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందించనున్నారు.