బీహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం

బీహార్ పర్యటన లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీకి చెందిన ఏడు విభాగాల రెండు రోజుల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశం బీహార్‌లో జరగబోతున్నాయి. దీనిని ప్రారంభించేందుకు జేపీ నడ్డా శనివారం పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చదివిన పాట్నా కాలేజీలో సెమినార్‌కు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భవనం వద్దకు వచ్చి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో జేపీ నడ్డాను అడ్డుకుని.. జేపీ నడ్డా వాపస్‌ జావో(వెనక్కి వెళ్లండి) అంటూ నినాదాలు చేశారు.

జాతీయ విద్యా విధానం-2020ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాట్నా యూనివర్శిటీకి కూడా కేంద్ర హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం, జేపీ నడ్డా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఏ విద్యార్థులను అడ్డుకునేందుకు బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రయత్నించింది. దీంతో ఘర్షణను నివారించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేశారు.