ఆయన ధోరణి భారత్‌కి మంచిది కాదు..జూనియ‌ర్ ట్రంప్‌

చైనా నుంచి ఉన్న ముప్పును మేము అర్థం చేసుకోగలం

Trump Jr

వాషింగ్టన్‌: అమెరికాలో నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ జోరుగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా ప్రచారం చేస్తున్నారు. బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలపై ఆయన ఏకంగా ‘లిబరల్‌ ప్రివిలేజ్‌’ పేరిట ఓ పుస్తకాన్నే రాశారు. తాజాగా ఆ పుస్తక విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ.. బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చైనా పట్ల వ్యవహరిస్తున్న తీరు భారత్‌కి మంచిది కాదని చెప్పారు.

చైనా నుంచి ఉన్న ముప్పును తాము అర్థం చేసుకోగలమని, దీని గురించి భారతీయ అమెరికన్లకన్నా అధికంగా ఎవరికీ తెలియదేమోనని అన్నారు. బైడెన్‌కు ఎన్నికల ప్రచారం కోసం చైనీయులు 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బైడెన్‌ గొప్ప వ్యాపారవేత్త అని, ఆయనను తమకు సానుకూలంగా మార్చుకోవచ్చనే చైనా భావిస్తోందని తెలిపారు. బైడెన్‌ వైఖరి కూడా చైనా పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/