మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారుల నోటీసులు

బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఉన్న ఈ షాపింగ్ మాల్ దాదాపు రూ.8 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని లేకపోతే షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని అధికారులు మాల్ ఎదుట మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు. ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ రెడ్డి ఈ మాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీకి జీవన్ మాల్.. ఎనిమిది కోట్ల రూపాయలను బకాయి పడ్డట్లు సమాచారం.

ఇంతవరకు ఆ బాకాయిలు చెల్లించకపోవడంతో డిసెంబర్ 7వ తేదీ గురువారం ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ కు నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని జీవన్ మాల్ కు వెళ్లి.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులను ఖాళీ చేయాలని ఆర్టీసీ అధికారులు మైక్ ద్వారా తెలిపారు. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని సమాచారం. విద్యుత్ శాఖకు కూడా రూ.2 కోట్ల బకాయిలు ఉన్నాయని.. గతంలోనే విద్యుత్తు నోటీసులు అందాయని తెలిసింది. జీవన్ రెడ్డి అధికార దుర్వినియోగం కారణంగానే బకాయిలు కోట్ల రూపాయల మేర ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.