BRS ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడీ మద్దతు

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యా వంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేశ్ ను గెలిపించాలని ఎక్స్ (ట్విటర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

రైతుకుటుంబంలో పుట్టి, బిట్స్‌ పిలానీలో గోల్డ్‌మెడల్‌ సాధించి అమెరికా అవకాశం వదులుకొని సమాజం కోసమే రాకేశ్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వరంగల్‌లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతగా ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా 2021లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ బై ఎలక్షన్‌ అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.