ఛలో మాచర్ల – టీడీపీ పిలుపు

టీడీపీ నేతలు ఈరోజు మాచర్లలో పర్యటించనున్నారు. పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఉదయం 9గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, జీవీ ఆంజనేయులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

మరోపక్క పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా… లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడటంతో… ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు ఏ1గా చేర్చారు. నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది. డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని అనుమానించిన పోలీసులు.. అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు పరారయినట్టు కూడా వార్తలు హల్‌చల్‌ చేశాయి.