కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీఆరఎస్ మాజీ ఎమ్మెల్యే

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పి ఛైర్మన్ భాగ్య లక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన నల్లాల ఓదెలు, ఆయన సతీమణి.. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదేలు 2010, జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లలో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై గెలుపొందాడు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బాల్క సుమన్‌కు టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. దీంతో ఓదేలు ఎమ్మెల్యే పదవికి దూరం కావాల్సి వచ్చింది. అనంతరం ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్ఎస్ నియమించింది. అయితే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బాల్క సుమన్, నల్లాల ఓదేలు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. దీంతో ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని , ఈరోజు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.