మెదక్ ఎంపీ టికెట్ అడుగుతున్న జగ్గారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్..పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాగే విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భవిస్తూ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించడం చేసింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు.

ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా పోటీచేసేందుకు తన భార్య నిర్మల గౌడ్ కు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదస్ మున్సి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. గతంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎమ్మెల్సీగా పోటీచేసి.. అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాలో ఏకగ్రీవంగా కాకుండా దీటుగా నిలబడ్డారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా తెలిపినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మల గౌడ్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. మరి జగ్గారెడ్డి కోరికను కాంగ్రెస్ అధిష్టానం తీరుస్తుందా..అనేది చూడాలి.