రష్యాలో కూలిన సైనిక విమానం

రష్యాలో ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలింది. ఈ ఘటనలో విమానంలోని 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇవనోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్లు తెలిపింది.

కాగా, గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తమ ఐఎల్‌-76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది..

ఇటీవలే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌కు బయలుదేరిన యునైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానానికి పెను ప్రమాదం తప్పింది. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో ఎడమ వైపున ల్యాండింగ్‌ గేర్‌ వద్ద ఉన్న టైరు ఊడిపోయింది. దీంతో పైలెట్లు లాస్‌ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్‌ను దారి మళ్లించారు. ల్యాండింగ్‌ సమయంలో విమానంలో మంటలు చెలరేగితే అదుపు చేయడానికి లాస్‌ ఏంజిల్స్‌ విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు.

పైలెట్లు విమానాన్ని చాకచక్యంగా రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్‌ చేయడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.