అసలైన ఆర్థిక నేరస్తుడు జగన్ : యనమల

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశాడని ఆరోపణ

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్తుడిగా చూపించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అసలైన ఆర్థిక నేరస్తుడు జగన్ అని… 16 నెలలు జైల్లో ఉండొచ్చాడని చెప్పారు. బినామీ లావాదేవీలతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్క రోజైనా చంద్రబాబును జైల్లో పెట్లాలనే ఆతృత తప్ప ఈ కేసులో ఏమాత్రం పస లేదని ఎద్దేవా చేశారు.

క్విడ్ ప్రోకో ద్వారా రాష్ట్ర సంపదను దోచేసిన వ్యక్తి ఆర్థిక నేరస్థుడా, లేక నిజాయతీగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తా? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థులు హత్య చేసిన వారి కంటే ప్రమాదకరమని జగన్ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పారు. ఇలాంటి వారి కేసుల విషయం ఏడాదిలోనే తేల్చి శిక్షించాలని సుప్రీం చెప్పిందని… అయినప్పటికీ జగన్ కేసులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఏ పదవి లేకుండానే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచేసిన జగన్ రెడ్డి జీవిత చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే ఎంత ఆస్తి పెరిగిందో అర్థమవుతుందని చెప్పారు. జగన్ రెడ్డికి సంబంధించిన రూ. 5వేల కోట్లను ఈడీ అటాచ్ చేసిందని… ఇంత ఆస్తి ఎలా సంపాదించారో వైసీపీ నేతలు, సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.

లండన్ కు జగన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. ఈ రోజు తిరిగొస్తున్న ఆయనకు రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబును అరెస్ట్ చేశారు తప్ప ఇందులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. చంద్రబాబుకు హాని జరిగితే జగన్ బాధ్యత వహించాలని చెప్పారు. అహం, కోరిక, పరిపాలన కాంక్షతో దుర్యోధనుడు నాశనం అయ్యాడని… ఇప్పుడు జగన్ రెడ్డి కూడా ఇదే దారిలో వెళ్తున్నారని అన్నారు. జగన్ బినామీ ట్రాన్సాక్షన్స్ తన దగ్గర ఉన్నాయని, సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని చెప్పారు.

హైదరాబాద్ లో వైఎస్ ఉన్న ఇల్లు కూడా కబ్జాది కావడంతో రెగ్యులరైజేషన్ కు అడిగారని… అలాంటి ఆర్థిక పరిస్థితులున్న జగన్ కు నేడు లక్షల కోట్లు, ప్యాలెస్ లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జగన్ సీబీఐ కేసుల్లో రేపటి నుంచి విచారణ ప్రారంభం అవుతోందని… ట్రయల్స్ ప్రారంభం అయితే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు.