ఆవుల సుబ్బారావు ను కస్టడీలోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాడి వెనుక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆవుల సుబ్బారావు ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపటి నుండి ఆయన్ను విచారించబోతున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్‌ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్‌ తీసుకెళ్లారు. సికింద్రాబాద్‌ అటాక్‌లో సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.

అ‍ల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్‌ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్‌ పోలీసులు విచారించనున్నారు. మరోపక్క అగ్నిపథ్ విషయంలో కేంద్రం తగ్గడం లేదు. ఓ పక్క దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మాత్రం అగ్నిపథ్ ను రద్దు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే అగ్నివీర్ కు సంబదించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మరోపక్క అగ్నివీరులకు తమ అనుబంధ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థ రక్షలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని జీఎంఆర్‌ తెలిపింది. రక్ష సెక్యూరిటీ సొల్యూషన్స్‌ అనే సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ . ఈ సంస్థ గార్డుల సమకూర్చే సేవలు అందిస్తోంది. ప్రధానంగా టెక్నాలజీ సంస్థలకు, ఫైర్‌ సర్వీసెస్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి సేవలు అందిస్తోంది. ఈ సంస్థల్లో ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.