ఒడిశా ముఖ్యమంత్రి తో ముగిసిన జగన్ భేటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..ఒడిషా పర్యటన లో భాగంగా సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. భువనేశ్వర్ లోని నవీన్ పట్నాయక్ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.

ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు సీఎం నవీన్ పట్నాయక్. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు వివిధ శాఖ ఉన్నతాధికారలు పాల్గొన్నారు.