జగన్ ప్రభుత్వం నా ఫోన్లను ట్యాప్ చేసింది – నారా లోకేష్

తెలంగాణ తరహాలో ఏపీలో కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఏపీలోని ప్రముఖ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు.‌ ఎమ్మెల్యే, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారని విమర్శించారు. ‌ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సైత వైసీపీ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసి, ఆపై ఆధారాలను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ‘దీనిపై నాకు స్పష్టమైన సమాచారం అందింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం మాకందరికీ తెలుసు. నా ఫోన్పై పెగాసస్ దాడి జరిగిందని గతంలో చెప్పాను. రెండుసార్లు పెగాసస్ అటాక్ జరిగిందనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చివరగా ఏప్రిల్లో అటాక్ అయింది’ అని ANI ఇంటర్వ్యూలో తెలిపారు.