పెట్రోల్, డీజిల్ ధరలను అత్యధికంగా పెంచింది ఏపీనే

జగన్ సీఎం అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ పై రూ. 28 వేల కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు: పట్టాభి

అమరావతి : గత రెండున్నరేళ్లుగా రకరకాల పన్నులతో రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ భారం మోపుతున్నారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై ఆయన అవినీతి పత్రికలో పూర్తి పేజీలో తప్పడు యాడ్ ఇచ్చారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం భారం మోపలేదని… రోడ్ల కోసం కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని సిగ్గులేకుండా ఆ ప్రకటనలో పేర్కొన్నారని మండిపడ్డారు. దేశంలోనే గత సంవత్సర కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలను అత్యధికంగా పెంచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంటు సాక్షిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారని… దీనికి ముఖ్యమంత్రి ఏం చెపుతారని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం 2019-20లో పెట్రోల్, డీజిల్ పై విధించిన పన్నుల ద్వారా రూ. 10,168 కోట్లు, 2020-21లో రూ. 11,014 కోట్లు, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే దాదాపు రూ. 7 వేల కోట్లను సమకూర్చుకుందని పట్టాభి అన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 21.50… లీటర్ డీజిల్ పై రూ. 29.32 పన్నులు వసూలు చేస్తోందని చెప్పారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రూ. 28 వేల కోట్ల పైన పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో కొల్లగొట్టారని మండిపడ్డారు. దీనికి అదనంగా రోడ్ల సెస్ పేరుతో ప్రతి లీటర్ పై ఒక రూపాయి వసూలు చేస్తున్నారని అన్నారు. వైస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని… నిజాలను నిర్భయంగానే మాట్లాడుతుంటానని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/