రాజ్ భవన్ లో తేనీటి విందు..హాజరుకానున్న జగన్‌, చంద్రబాబు

టీడీపీ అధినాయకత్వానికి గవర్నర్ నుంచి ఆహ్వానం

CM Jagan wished Chandrababu happy birthday
CM Jagan -Chandrababu

అమరావతిః నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపిలోని రాజ్ భవన్ లో గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా ఆహ్వానం అందింది. టీడీపీ విపక్షంలోకి వచ్చాక ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు వస్తుండడం ఇదే ప్రథమం. అయితే, నేడు తొలిసారిగా చంద్రబాబు స్వయంగా హాజరుకానుండడంతో అందరి దృష్టి రాజ్ భవన్ వైపు మళ్లింది. ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ సాయంత్రం రాజ్ భవన్ లో తేనీటి విందు ఇస్తున్నారు.

అంతేకాక ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని చేబ్రోలు హన్‌మయ్య కంపెనీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను శాలువాతో సన్మానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. నేటి యువతలో జాతీయతను, దేశభక్తిని పెంచవలసిన అవసరముందని పేర్కొన్నారు. నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వ బ్రతుకుల నుంచి దేశాన్ని విముక్తి పరిచిన జాతీయ నాయకుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దామని అన్నారు. భవిష్యత్‌ కోసం పునరంకితం కావాలని అన్నారు. నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు పరిగెడుతుందని తెలిపారు. నాడు నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు దేశం కోసం ఎన్నో చేస్తున్నారని కొనియాడారు.

పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో పోటీపడేలా చేశాయని తెలిపారు. పేద ప్రజల మేలు కోసం ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. కరోనాను లెక్క చేయకుండా శ్రమించిన రైతులను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో వచ్చిన సంస్కరణలకు టీడీపీ మద్దతు ఇచ్చిందని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/