దామెర రాకేష్ అన్నకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి ఎర్రబెల్లి

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళనలో దామెర రాకేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆయన కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించడం జరిగింది. ప్రకటించినట్లే మూడు రోజుల క్రితం రూ. 25 లక్షల చెక్ ను ఆ కుటుంబ సభ్యులకు అందజేసిన నేతలు..ఈరోజు రాకేష్ అన్న రాజుకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసి మాట నిలబెట్టుకున్నారు.
ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామంలో దామెర రాకేష్ సంస్మరణ సభ ఈరోజు జరిగింది. ఈ సభలో రాకేష్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. అంతకుముందు రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో రాకేశ్ మృతి చెందడం బాధాకరమన్నారు. రాకేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాలేదు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో అతని కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. రాకేష్ సోదరుడు రామ్రాజ్కు రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేశామన్నారు. అలాగే దబీర్‌పేట గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇక నుంచి ఈ గ్రామాభివృద్ధి తనదే అని ప్రకటించారు. దబీర్పేటలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నానని పేర్కొన్నారు. కేవ్లా తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేస్తామన్నారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి ఏ పథకాలు వచ్చినా దబీర్‌పేటకు అధిక ప్రాధాన్యం ఇస్తామని దయాకర్ రావు స్పష్టం చేశారు.