అసలు దేశంలో లేని కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు అవసరమా?: లక్ష్మణ్

bjp-mp-laxman-comments-on-revanth-reddy-govt

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బిజెపి పడగొట్టబోదని… అదే సమయంలో ప్రభుత్వం పడిపోతుంటే తాము కాపాడలేమన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బిజెపి నేతలు అంటున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలకు బిజెపి ఎంపీ లక్ష్మణ్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని చెబుతున్నారని… కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణలో అవసరమా? అని ప్రశ్నించారు. రేపు దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ రాజకీయంగా విఫలమైన నాయకుడన్నారు. ప్రధాని మోదీకి సరితూగే వ్యక్తి ప్రతిపక్షంలో లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రజలంతా లోక్ సభ ఎన్నికల్లో బిజెపితో కలిసి రావాలని కోరారు. కుటుంబ పాలన, వంశపారంపర్య పాలన, కుల పాలన, అవినీతి పాలనకు తెరదీయాలంటే బిజెపి రావాలన్నారు.