‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ చూసిన చిరంజీవి , రాజమౌళి

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మెగా ప్రివ్యూ వేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, నాగ చైతన్య లు నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చిత్రం తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతను పెంచాయి.
ఈ క్రమంలో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రముఖుల కోసం లాల్ సింగ్ చద్దా స్పెషల్ షోను ప్రదర్శించడం విశేషం. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకు ప్రత్యేక అతిథులుగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత అమిర్ నటించిన ఈ సినిమాను అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్ పాండే, వయాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్‌కి సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించటానికి తన శరీరాన్ని ఈ వయసులో బాగానే కష్టపెట్టారట. మరి ఆయన కష్టం ఏ మేరకు సఫలీకృతమవుతుందనేది వెండితెరపై చూడాల్సిందే.