నేడు ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోనీ ప్రమాణం

italy-first-female-prime-minister-meloni-will-take-oath-today

రోమ్: ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ఈరోజు ప్రమాణం చేయనున్నారు. 45 ఏండ్ల జార్జియా మెలోనీ ప్రధాని పీఠం అధిష్టిస్తున్న తొలి మహిళగా ఇటలీ రికార్డులకెక్కనున్నారు. జార్జియా మెలోనీతోపాటు ఆమె క్యాబినెట్‌ కూడా ఇవాళ ప్రమాణం చేస్తారు. దీంతో ఇటలీలో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్నది. నాలుగేండ్ల క్రితం కేవలం 4.13 శాతం ఓట్లు పొందిన మెలోనీ పార్టీకి.. ఈ దఫా 26 శాతం ఓట్లు లభించడం విశేషం.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఒక మితవాద నేత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. జార్జియా పార్టీ ఇటాలియన్ నియంత ముస్సోలినీకి మద్దతుదారు. వలసదారులకు ఆశ్రయం ఇవ్వకపోవడం, స్వలింగ సంపర్కులను వ్యతిరేకించడం, తన ఎన్నికల ఎజెండాగా మెలోనీ ప్రకటించి ప్రజల మద్దతు కూడగట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి ఆశించిన రీతిలో మద్దతు రావడంతో అనూహ్యగా ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. తన పదునైన మాటలతో యువతను ఆకట్టుకోవడం మెలోనీ ప్రత్యేకత.

జార్జియా మెలోనీ 15 జనవరి 1977న జన్మించారు. జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయవేత్తగా ఎదిగారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, నియంత ముస్సోలినీ మద్దతుదారులచే ప్రారంభమైన ఉద్యమంలో 15 ఏండ్ల వయసులో మెలోనీ పనిచేశారు. రోమ్‌లో జన్మించిన మెలోని ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ మాట్లాడతారు. చిన్న వయసులోనే తండ్రి వదిలిపెట్టి వెళ్లడంతో తల్లి సమక్షంలో పెరిగింది. మెలోనీ 21 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 31 ఏండ్ల వయసులో బెర్లుస్కోని ప్రభుత్వం మంత్రిగా పనిచేశారు. 2012 లో నేషనల్‌ అలయెన్స్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొందరితో కలిసి బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీని స్థాపించింది. ఈమె 16 ఏండ్ల వయసున్న కుమార్తె ఉన్నది.