జార్జియాకు భారత్ బహుమతి

క్వీన్ కీటవాన్ అవశేషాలు అందజేత
ఆ దేశ ప్రధానికి ఇచ్చిన విదేశాంగ మంత్రి

టిబిలిసి: భారత్ జార్జియాకు ఓ బహుమతిని అందించింది. ఆ దేశ ప్రభుత్వ విజ్ఞప్తులతో సెయింట్ క్వీన్ కీటవాన్ అవశేషాలను అప్పగించింది. ఈ కానుకతో రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ‘‘జార్జియా ప్రభుత్వం నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు క్వీన్ కీటవాన్ చారిత్రక, ఆధ్యాత్మిక సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుని ఆమె అవశేషాల్లోని ఓ భాగాన్ని కానుకగా ఇస్తున్నాం’’ అని తెలిపింది. ఇవ్వాళ విదేశాంగ మంత్రి జై శంకర్.. రెండ్రోజుల అధికారిక పర్యటన కోసం జార్జియాకు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆ పురాతన అవశేషాలను ఆ దేశ ప్రధాని హెచ్ఈ. ఇరాకలీ గరీబాష్విలికి అందజేశారు. కాగా, సెయింట్ క్వీన్ కీటవాన్.. 17వ శతాబ్దానికి చెందిన జార్జియా రాణి. పాత గోవాలోని సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ లో 2005లో ఆమె అవశేషాలను భారత పురాతత్వ నిపుణులు గుర్తించారు.

మధ్యయుగం నాటి పోర్చుగీస్ రికార్డుల ప్రకారం ఆ అవశేషాలు ఆమెవేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శాస్త్రీయ నిర్ధారణ కోసం వాటి నమూనాలను హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు. వాటి డీఎన్ఏని పరీక్షించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు.. అవి రాణివేనని తేల్చారు. జార్జియా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2017 సెప్టెంబర్ లో ఆరు నెలల ఎగ్జిబిషన్ కోసం భారత్ ఆ అవశేషాలను పంపించింది. తర్వాత మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ కాలంలో జార్జియాలోని వివిధ చర్చిల్లో ఆమె అవశేషాలను ప్రదర్శించారు. తర్వాత 2018 సెప్టెంబర్ లో వాటిని భారత్ కు జార్జియా తిరిగి ఇచ్చేసింది. తాజాగా వాటిలోని ఓ భాగాన్ని జార్జియాకు భారత్ కానుకగా అందించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/