హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

బడా కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ కంపెనీలే లక్ష్యంగా సోదాలు
ఎమ్మెల్యే మాగంటితోపాటు ఆయన సోదరుడి ఇళ్లు, కార్యాలయాలపైనా దాడులు

IT searches at many places in Hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో మరోమారు ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఐటీ అధికారులు వంద బృందాలుగా విడిపోయి ఈ ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఒకేసారి ఇంత భారీ ఎత్తున సోదాలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సోదాల గురించే అంతా చర్చించుకుంటున్నారు.

ప్రధానంగా చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీలే లక్ష్యంగా సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు శంషాబాద్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో పూజకృష్ణ చిట్‌ఫండ్‌లో 20 బృందాలు తనిఖీ చేస్తున్నాయి. దీని డైరెక్టర్లు అయిన సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజలక్ష్మీ , ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లపైనా అధికారులు దాడులు చేశారు. అలాగే, జీవన్‌శక్తి చిట్‌ఫండ్, ఈకామ్ చిట్‌ఫండ్‌లతోపాటు దాదాపు 60 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తోపాటు కూకట్‌పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హౌసింగ్‌బోర్డు 7వ ఫేజ్‌లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్‌మెంట్స్‌లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్ కంపెనీ యజమాని అయిన అరికెపూడి కోటేశ్వరరావుతోపాటు రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే, వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, ఎల్లారెడ్డిగూడలోని వ్యాపారి మాగంటి వజ్రనాథ్, శంషాబాద్‌లోని ఈ-కామ్ సంస్థ నిర్వాహకుడు రఘువీర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. గత ఐదేళ్ల ఐటీ రిటర్నులపై అనుమానాలు వ్యక్తం కావడంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.