బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు..

దేశంలో గత కొద్దీ నెలలుగా ఐటీ , ఈడీ దాడులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ , బిజినెస్ , సినీ ఇలా ఎవర్ని కూడా వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఆఫీసులలో, ఇళ్లలో దాడులు జరుగగా..మంగళవారం ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా బీబీసీ సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు ఐటీ అధికారులు. ఇప్పటికే మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు జరగడం చర్చ గా మారింది.

ఇటీవలే భారత్‌లో బీబీసీని నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇండియా-ద మోదీ క్వశ్చన్‌ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే కేంద్రం నిషేధించింది. ఈక్రమంలో దేశంలో బీబీసీ, బీబీసీ ఇండియాను బ్యాన్‌ చేయాలంటూ హిందూ సేన సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిల్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఒక ఛానల్‌ను బ్యాన్‌ చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలా జారీ చేస్తుంది’’ అంటూ పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది.