తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సర్కార్

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర సర్కార్. ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి కాగా, 51 శాతం మంది ఫెయిల్ కావడం పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితాలతో వేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

10 మార్కులు కలిపితే 8,070 మంది, 25 మార్కులు కలిపితే 70 వేల మంది ఉత్తీర్ణులవుతారన్న మంత్రి.. ఫెయిలైనవాళ్లందరికీ కనీస మార్కులు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. నెల రోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకున్నా.. ప్రభుత్వాన్ని నిందించడం చాలా బాధ కలిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.