మేన‌కా గాంధీపై ఇస్కాన్ వంద కోట్ల ప‌రువున‌ష్టం దావా

ఇస్కాన్ గోవులను అమ్ముకుంటోందని ఆరోపించిన మేనకా గాంధీ

ISKCON Sues Maneka Gandhi For Rs 100 Crore Over Cow Slaughter Charge

న్యూఢిల్లీః తమపై బిజెపిఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. గోశాలల్లోని గోవులను ఇస్కాన్ అమ్ముకుంటోందని మేనకా గాంధీ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె వ్యాఖ్యలు భక్తులను తీవ్రంగా గాయపరిచాయి. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపించింది.

కోల్‌క‌తాలోని ఇస్కాన్ ఉపాధ్య‌క్షుడు రాధార‌మ‌ణ్ దాస్ మాట్లాడుతూ.. మేన‌కా గాంధీ వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులను ఆమె వ్యాఖ్య‌లు బాధించాయ‌ని, ఆమెకు వంద కోట్ల ప‌రువు న‌ష్టం నోటీసులు పంపించామన్నారు. ఆమె చేసిన నిరాధార ఆరోపణలపై తాము అన్ని విధాలుగా న్యాయపరంగా పోరాడుతామన్నారు. ఇస్కాన్ పైన అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ప్రశ్నించారు.

క‌బేళాల‌కు గోవుల్ని అమ్ముకుంటున్నార‌ని, దేశంలో జ‌రుగుతున్న అతిపెద్ద మోస‌మ‌ని మేన‌కా గాంధీ ఆరోపించారు. ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందుత‌ున్న ఇస్కాన్ త‌మ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నారని చెప్పిన వీడియో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల ఏపీలోని అనంత‌పురంలో ఉన్న గోశాల‌ను సంద‌ర్శించిన‌ట్లు ఆమె చెప్పారు. అక్క‌డ పాలిచ్చే ఆవు ఒక్క‌టి కూడా లేద‌ని, దూడ‌లు కూడా లేవ‌ని, మొత్తం డెయిరీలో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేద‌ని, అంటే అక్క‌డ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నార‌ని తెలుస్తోంద‌ని ఆమె ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. గోవులు, ఆవుల సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని ఇస్కాన్ జాతీయ ప్ర‌తినిధి యుధిష్ట‌ర్ గోవింద దాస్‌ తెలిపారు. భారత్‌లోనే కాకుండా యావ‌త్ ప్రపంచంలో తాము గోవుల్ని పోషిస్తున్నట్లు తెలిపింది. గోవుల‌కు జీవితాల‌ను ప్ర‌సాదిస్తున్నామ‌ని, వాటిని క‌బేళాల‌కు అమ్మ‌డంలేద‌ని ఇస్కాన్ స్పష్టం చేసింది.