ఇస్కాన్ సంస్థపై బిజెపి ఎంపీ మేనకా గాంధీ కీలక ఆరోపణలు

గోశాలల నిర్వహణలో అవకతవకలు..గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారు..

iskcon-sells-cows-from-their-gaushalas-to-butchers-alleges-maneka-gandhi

న్యూఢిల్లీః గోశాలల నిర్వహణ పేరుతో గోవులను కబేళాకు అమ్ముకుంటోందని ఇస్కాన్ సంస్థపై బిజెపి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థ సభ్యులు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోశాలల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకుంటోందని, వాటి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవులను కసాయి వాళ్లకు అమ్ముకుంటున్నారని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనంతపూర్ లోని ఇస్కాన్ గోశాలను సందర్శించినట్లు ఎంపీ మేనకా గాంధీ చెప్పారు. అయితే అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, అన్నింటినీ కబేళాకు అమ్మేశారని మండిపడ్డారు. గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయి వాళ్లకు అమ్ముకునే ఇలాంటి వాళ్లే రోడ్లపై హరేరామ.. హరేకృష్ణ అంటూ వల్లెవేస్తుంటారని విమర్శించారు.

అయితే, ఎంపీ మేనకా గాంధీ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. గో సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. గోశాలకు వచ్చిన గోవులను కడవరకూ జాగ్రత్తగా సంరక్షిస్తామని సంస్థ ప్రతినిధి యుధిష్టర్ గోవిందా దాస్ ట్వీట్ చేశారు.