జగన్ కు ఊరట లభిస్తుందనే రఘురామ ముందే ఉహించాడట..

సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి కి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్‌ను కొట్టేసింది. తన పిటిషన్ ను కొట్టివేయడం పట్ల రఘురామ స్పందించారు.

సీబీఐ కోర్టు తీర్పు ఇలాగే వస్తుందని తాను ముందే ఊహించానని రఘురామకృష్ణరాజు అన్నారు. గత విచారణ సందర్భంగా జడ్జి తన అభిప్రాయాన్ని వెల్లడించకముందే… జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసిందంటూ సాక్షిలో బ్రేకింగ్ వచ్చిందని… ఆ రోజు సాక్షి ప్రకటించిన విధంగానే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను నెగ్గననే విషయం గత నెల 25వ తేదీనే తనకు అర్థమయిందని చెప్పారు. ఒకవేళ కోర్టులో తాను నెగ్గి ఉంటే… జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టుకు వెళ్లేవారని… ఇప్పుడు తాను హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. హైకోర్టులో కూడా వారికి అనుకూలంగానే తీర్పు వస్తే… తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.