యువతలో గుండెపొటు, కొవిడ్‌కు మధ్య సంబంధంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశంః మంత్రి మాండవీయ

రెండు మూడు నెలల్లో నివేదిక వస్తుందని మంత్రి వెల్లడి

is-there-a-link-between-covid-and-rising-incidents-of-heart-attack-this-is-what-health-minister-had-to-say

న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా యువత కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పందించారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ‘‘యువతలో గుండెపొటు కేసులకు కొవిడ్‌కు ఏదైనా సంబంధం ఉందా అని తేల్చేందుకు ప్రభుత్వం ఓ అధ్యయనానికి ఆదేశించింది. దీని తాలుకు ఫలితం రెండు మూడు నెలల్లో వస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఎందరో యువ ఆర్టిస్టులు, అథ్లెట్లు, క్రీడాకారులు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు మనం చూశాం. ఈ ఘటనలపై కచ్చితంగా అధ్యయనం చేయాలి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో మొత్తం 214 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. వీటిల్లో కొన్ని ఉపవేరియంట్ల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ వేరియంట్లేవీ భారీ సంక్షోభాలు కలిగించేంతటి ప్రమాదకరమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఇక కేసుల్లో పెరుగుదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పా్ట్లు చేసిందని మంత్రి భరోసా ఇచ్చారు. ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్, ఇతర క్రిటికల్ కేర్ ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయని వివరించారు.