ఐఆర్‌సిటిసిలో వాటా విక్రయానికి రెడీ

ఈక్విటీ మార్కెట్‌పై పెద్ద ఎత్తున కరోనా ప్రభావం

IRCTC
IRCTC

న్యూఢిల్లీ: 2002-21 ఆర్థిక సంవత్సరంలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సిటిసి)లో వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

వాటావిక్రయ ప్రక్రియను నిర్వహించేందుకు మర్చంట్‌ బ్యాంకర్స్‌ నుంచి బిడ్స్‌ని ఆహ్వానించింది ప్రభుత్వం దీని ప్రకారం సెప్టెంబరు 10వ తేదీలోగా మర్చంట్‌ బ్యాంకర్లు బిడ్స్‌ దాఖలు చేయాలి.

ఐఆర్‌సిటిసిలో ప్రస్తుతం ప్రభుత్వానికి 87.40శాతం వాటా ఉంది. సెబి పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనల ప్రకారం కంపెనీలో వాటాను ప్రభుత్వం 75శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కొంత వాటాను ఐపిఒ ద్వారా కేంద్రం విక్రయించింది.

దీని ద్వారా రూ.645కోట్లను సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరలో రూ.2.10లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇందులో భాగంగా ఆయిల్‌ కంపెనీల విక్రయం, ఎల్‌ఐసి వాటాను ఐపిఒ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

వాటావిక్రయం నేపథ్యంలో ఐఆర్‌సిటిసి షేర్లు గురువారం ఒక్కరోజే 1.05శాతం మేర నష్టపోయి రూ.1347.55వద్ద క్లోజ్‌అయింది.

ఇండియన్‌ రైల్వేస్‌ 2019 అక్టోబర్‌ నుంచి స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో ఉంది. ఐపిఒ ద్వారా అప్పుడు కొంత సమీకరించింది.

ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.2.10లక్షల కోట్ల సమీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.20లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.90వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది ఈక్విటీ మార్కెట్‌పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.

దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలు విక్రయించలేకపోయింది.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/