10 గ్రాములు రూ.52,345

ఎంసిఎక్స్‌లో పెరిగిన పసిడి

Gold prices

ముంబై: బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. గతవారం భారీగా తగ్గినా ధరలు అంతకుముందు అంతేస్థాయిలో పెరిగాయి.

ఈ వారం స్వల్ప తగ్గుదలను, పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. గురువారం తగ్గిన ధరలు, శుక్రవారం మరోసారి పెరిగాయి.

మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్‌లో అక్టోబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 0.4శాతం పెరిగి 10 గ్రాములు రూ.52,345పలికింది.

వెండి కిలో ధర రూ.1000 పెరిగి రూ.68,560 పలికింది. ఇంతకుముందు రెండు సెషన్లలో పసిడి రూ.1500 వరకు తగ్గగా, వెండి కిలో రూ.1650కి పైగా నష్టపోయింది.

రెండు వారాల క్రితం పసిడి రూ.57వేల రికార్డుతో ధర వేలల్లో తక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.51,850నుంచి రూ.51,200కు పడిపోయింది.

24 క్యారెట్ల పసిడి రూ.700 తగ్గి రూ.55,850పలికింది. చెన్నైలో 22 క్యారెట్లు రూ.50,840, 24 క్యారెట్లు రూ.55,460, ముంబైలో 22 క్యారెట్లు రూ.50,990 పలికింది.

హైదరాబాద్‌, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.800 వరకు తగ్గి రూ.55,500కుపైగా పలికింది.

22క్యారెట్ల పసిడి రూ.51వేల వరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్వంగా పెరిగాయి. స్పాట్‌ గోల్డ్‌ 0.4 శాతం పెరిగి ఔన్స్‌ ధర 1,949.83డాలర్లకు చేరుకుంది.

అమెరికా డాలర్‌ విలువ ఇతర కరెన్సీలతో పడిపోయింది. ఈ ప్రభావం పసిడిపై పడింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్‌ 27.38 డాలర్లు, ప్లాటినమ్‌ 0.5 శాతం పెరిగి 922.24 డాలర్లకు చేరుకుంది.

పసిడి ధరలు ఔన్స్‌ ధర 1949 నుంచి 1932డాలర్ల మధ్య ట్రేడ్‌ కావొచ్చునని అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ఆల్‌టైమ్‌ హైకి చేరడం, సెప్టెంబర్‌ భేటీలో యుఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశముందన్న అంచనాలు గురువారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలను దెబ్బతీశాయని చెబుతున్నారు. శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/