కొత్తగా రానున్న ఐపిఎల్‌ ఆల్‌స్టార్‌ గేమ్‌

కెప్టెన్‌గా ధోనీ.. రోహిత్‌, కోహ్లీ ఒకే జట్టులో

Virat Kohli and MS Dhoni
Virat Kohli and MS Dhoni

ముంబయి:  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్ నిర్వహణపై ఉహాగానాలు జోరందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆల్ స్టార్ గేమ్ కూడా ముంబై వేదికగానే మెగా టోర్నీ ఆరంభానికి నాలుగు రోజుల ముందు మార్చి 25న నిర్వహించనున్నారనే ప్రచారం జోరందుకుంది. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఈ సీజన్‌కు ముందు ఎనిమిది జట్ల ఆటగాళ్లను విడదీసి ఆల్‌స్టార్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ మార్చి 25నే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.

ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్‌ ఐపీఎల్‌కు కొత్త. ఇక క్రికెట్‌లో వరల్డ్ ఎలెవన్ , ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఈ తరహా కాన్సెప్ట్‌కు చెందినవే. ఆసియా దేశాల్లోని ఆటగాళ్లంతా ఒక జట్టైతే.. మిగతా ప్రపంచ ఆటగాళ్లంత మరో జట్టుగా తలపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్‌ల్లోని అన్ని జట్ల ఆటగాళ్లు సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ టీమ్‌లుగా విడిపోయి ఆడనున్నారు. ఈ ఆల్‌స్టార్ గేమ్ కాన్సెప్ట్‌లో భాగంగా ఐపీఎల్‌లోని మొత్తం 8 జట్ల ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఇలా నాలుగు జట్లలోని కీలక ఆటగాళ్లు తుది జట్లుగా బరిలోకి దిగి పోటీపడనున్నారు. విరాట్, రోహిత్ ఉన్న కూడా అనుభవం దృష్ట్యా సౌత్ వెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోనినే కొనసాగే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ టీమ్‌ కెప్టెన్సీకి స్టీవ్ స్మిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య పోటీ ఉన్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కే జట్టు పగ్గాలు అందొచ్చు. ఏదీ ఏమైనా ఈ ఆల్ స్టార్‌ మ్యాచ్‌తో అభిమానులకు కావాల్సిన మజా.. బోర్డు‌కు కావాల్సిన విరాళాలు పుష్కలంగా రానున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/