ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంటే ఎక్కువ చదువుకున్నానని , అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ మధ్య రసమయి బాలకిషన్ తరుచు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ..నేను కూడా బాగా చదువుకుని మొన్న డాక్టరేట్ సంపాదించా.. ఫస్ట్ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా పేరు ముందు డాక్టర్ అని లేదు. ఇప్పుడు గౌరవంగా పేరు ముందు డాక్టర్ అని పెట్టారు. ఒకసారి శిలాఫలకంలో మీరు వెళ్లి చూడండి. ఏమీ లేని నాడే బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివారు. ఇన్ని వసతులు ఉన్న ఈ సమయంలో నేను ఎందుకు చదవకూడదనే ఆలోచనతో డాక్టరేట్ చేసి మీ ముందు డాక్టర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌గా నిలబడ్డా. ఎమ్మెల్యే అంటే ఏదో అనుకుంటారు. నేను బాగా చదువుకున్నా. ఇక్కడ ఉన్నవాళ్లందరి కంటే నేను ఎక్కువ చదివా. చాలా పెద్ద చదువు చదివా.. 10 శాతం చెబుతున్నా. మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కంటే నేను ఎక్కువ చదివా’ అని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డాక్టరేట్ చేయలేదు. కానీ నేను చేశా. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే డాక్టరేట్ చేశా. నేను ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి MA,ఎంఫిల్, బీఈడీ చేశా. 20 సంత్సరాలు టీచర్‌గా పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు పాడానో మీకు తెలుసనీ అన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ చదువుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.