నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం

కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. దశల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి రూ.3 వేల కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో అర్హులకు 95,235 ఇళ్లు మంజూరు చేయనుంది.

ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నేరుగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి వెళ్తారు.

రాములోరి దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. సుమారు 5 వేల మంది మహిళలు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం భద్రాచలంలోనే నీటిపారుదల, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం రేవంత్‌, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మణుగూరులో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 6.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది.