అమెరికా ఆర్థికాభివృద్ధికి భారతీయ అమెరికన్లు తోడ్పడ్డారు

హెచ్‌1బీ సమస్యలు లేకుండా చేస్తా..జో బైడెన్

Joe Biden

వాషింగ్టన్‌: డెమోక్రాటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్‌ భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన ప్రసంగిస్తూ.. భారత సంతతికి చెందిన అమెరికావాసులపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారత సంతతికి చెందిన అమెరికావాసులు ఎంతగానో తోడ్పడ్డారని చెప్పారు. వారి కృషి, వ్యాపార నైపుణ్యాలతో తమ దేశ ఆర్థిక రంగానికి శక్తినిచ్చారని తెలిపారు. అమెరికాలో వారు సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారని ఆయన చెప్పారు.

అమెరికా ఇచ్చే హెచ్‌1బీ సహా ఇతర వలస విధానాల్లో నెలకొన్న చట్టపరమైన సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. భారతీయులు తమ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్ని నెలకొల్పారని ఆయన కొనియాడారు. సిలికాన్‌ వ్యాలీకి పునాదులు వేశారని, ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉన్న కంపెనీలకు వారు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. హెచ్1బీ వీసా, జాత్యహంకారం వంటి అంశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆయన విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భావితరాలకు మంచి భవిష్యత్తును అందిస్తానని చెప్పారు. మళ్లీ ఆర్థిక వ్యవస్థను లైన్లో పెడతానని ఆయన తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/