నాసాలో భారత సంతతి మహిళకు కీలక పదవి

నాసా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భవ్య

వాషింగ్టన్‌: ఇండియన్‌ అమెరికన్‌ భవ్యా లాల్‌ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాత్కాలిక చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సోమవారం నియమితులయ్యారు. అధ్యక్షుడు జోబైడెన్‌ సారథ్యంలో నాసాలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన సమీక్షా బృందంలో భవ్యా లాల్‌ సభ్యురాలిగా ఉన్నారు. ఇంజనీరింగ్‌, స్పేస్‌ టెక్నాలజీలో విస్తృత అనుభవం కలిగిన భవ్య 2005 నుంచి 2020 వరకూ శాస్త్ర సాంకేతిక రంగాల విధాన సంస్థ (ఎస్‌టీపీఐ)లో సభ్యురాలిగా సేవలందించారని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆమె పలు ఉన్నత ఫెడరల్‌ సైన్స్‌ కమిటీల్లో చురుకుగా పనిచేశారని పేర్కొంది. ఎస్‌టీపీఐలో చేరకముందు ఆమె సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ రీసెర్చి, కన్సల్టింగ్‌ సంస్థ సీఎస్‌టీపీఎస్‌ ఎల్‌ఎల్‌సీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని తెలిపింది. అంతరిక్ష రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గాను భవ్యా లాల్‌ ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ కరస్పాండింగ్‌ మెంబర్‌గా ఎంపికయ్యారని ఆ ప్రకటనలో నాసా తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/