”భారత్”గా మారనున్న “ఇండియా” ?

దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక!

parliament

న్యూఢిల్లీః కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది.

మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో… ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బిజెపి నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బిజెపి నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది.