ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ

సాయం మరింత పెంచాలని కోరిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్

India Says Zelensky Wrote To PM Modi, Ukraine Seeks More Humanitarian Aid

న్యూఢిల్లీః ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత దేశం అందిస్తున్న మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన లేఖ రాశారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రష్యా దురాక్రమణతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని జెలెన్ స్కీ ఆ లేఖలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అందిస్తున్న మానవతా సాయానికి కృతజ్ఞలు తెలిపిన జెలెన్ స్కీ.. ఈ సాయాన్ని మరింత పెంచాలని కోరారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖలను ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ సహాయక మంత్రి మీనాక్షీ లేఖికి అందజేశారు.

రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని, మందులు, వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తువులను మరింత ఎక్కువగా పంపించాలని కోరారని మీనాక్షీ లేఖి చెప్పారు. దీనిపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని, సాయాన్ని మరింత పెంచాలని సూచించారని మంత్రి చెప్పారు.