ఇజ్రాయిల్‌లోని భారత పౌరుల భద్రత కోసం సూచనలు

India issues advisory for its nationals amid Israel-Gaza conflict

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్‌లోని భారత పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక నోటీస్‌ జారీ చేసింది. ‘ఇజ్రాయిల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటించాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అనవసర కదలికలు నివారించండి. సెఫ్టీ షెల్టర్స్‌ వద్దకు వెళ్లండి. అదనపు సమాచారం కోసం ఇజ్రాయిల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్‌సైట్ లేదా వారి బ్రోచర్‌ను చూడండి’ అని పేర్కొంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా [email protected] ఇమెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ పౌరులను కోరింది. ఎలాంటి సహాయమైనా అందించేందుకు ఎంబసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

కాగా, శనివారం హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయిల్‌లో ప్రజలు పదుల సంఖ్యలో మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఎయిర్‌ ఢిఫెన్స్‌ ద్వారా హమాస్‌ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతోపాటు ఎదురుదాడి కోసం ఆపరేషన్‌ ఐరాన్‌ స్వార్డ్స్‌ చేపట్టింది.