ద్వేషపూరిత ప్రసంగం కేసు.. ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్

ఇమ్రాన్ ఖాన్‌పై వందకుపైగా కేసుల నమోదు

imran-khan-gets-bail-in-hate-speech-cases-till-june-8

ఇస్లామాబాద్‌ః విద్వేష పూరిత ప్రసంగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 8వ తేదీ వరకు బెయిలు మంజూరు చేసింది. ప్రభుత్వ సంస్థలపై ఆయన ప్రకటనకు సంబంధించి ఇమ్రాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే, ఆయనపై నమోదైన ఉగ్రవాదం కేసులకు సంబంధించి కోర్టు నేడు విచారణ జరపనుంది. అల్ కదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్‌తో పాకిస్థాన్ అల్లర్లతో అట్టుడికింది. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నానా రభస చేశారు.

ఈ కేసులో ఇమ్రాన్ సోమవారం తన భార్య బుష్రా బీబీతో కలిసి లాహోర్ హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 23 వరకు ప్రీ అరెస్ట్ బెయిలు మంజూరు చేసింది. కాగా, ఇమ్రాన్‌పై 100కుపైగా కేసులు నమోదయ్యాయి. తోషిఖానా (బహుమానాలు), అల్-కదీర్ ట్రస్ట్ కేసుల్లో ఆయన భార్య బుష్రాపైనా అభియోగాలు నమోదయ్యాయి. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టడం, ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పీటీఐ చీఫ్‌పై నమోదైన ఆరు కేసుల్లో గతవారం ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిలు లభించింది.