పార్టీ విలీనం, పొత్తుపై స్పందించిన వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేయ్యా..షర్మిల

YSRTP Chief YS Sharmila Press Meet

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు… పొత్తు పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అన్ని పార్టీల నుంచి మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం చార్జింగ్ మోడ్ లో ఉన్నామని స్పష్టం చేశారు.ఈరోజు పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయటం లేదన్నారు. విలీనం చేయటానికి పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. నేను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దు అని చెప్పదని.. అలాంటప్పుడు పార్టీని విలీనం ఎలా చేస్తానంటూ చెప్పుకొచ్చారామె. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం ఉందన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారామె. దీనికి సమాధానం చెప్పాలని.. ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అభివర్ణించారామె. మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ఆ విషయాలు తర్వాత వెల్లడిస్తామన్నారు వైఎస్ షర్మిల.విలీనం చేయాలనుకుంటే పార్టీనే పెట్టనని.. 3 వేల 800 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారామె. విలీనం చేయాలి అనుకుంటే ఎప్పుడో అది జరిగేదని.. ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు షర్మిల.

రాబోయే ఎన్నికల్లో పొత్తులపైనా స్పందించారు షర్మిల. జాతీయ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ ప్రభావం చూపిస్తుందని రిపోర్టులు వచ్చాయని.. అలాంటప్పుడు 10, 20, 30 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని మీడియానే ఎదురు ప్రశ్నించారు షర్మిల. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ మాదే అని.. ఎవరి దగ్గర సీట్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదన్నారామె. షర్మిల అంటే తెలియని వాళ్లు ఎవరూ లేరని.. మా పార్టీ బలంగా ఉందని.. చార్జింగ్ మోడ్ లో ఉన్నామని వెల్లడించారు.

కాగా, బెంగళూరులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో భేటీపైనా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే డీకే శివకుమార్ రాజకీయం చేశారని.. కష్టపడి పార్టీని గెలిపించారని.. వ్యక్తిగతంలో ఉన్న అనుబంధంతో కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు వివరించారు. మత, కుట్ర రాజకీయాలకు చెంపపెట్టుగా వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.