కరోనాతో ఆసుపత్రుల్లో లక్షలు కడుతుంటే ఆరోగ్య శ్రీ ఇచ్చారా? : అరవింద్‌

చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా..? మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా? .. అరవింద్

If lakhs are being spent in hospitals due to corona, have you given Aarogyasri? : Arvind

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా ఇస్తామంటూ బిఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనడం పట్ల అరవింద్ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా అరవింద్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కెసిఆర్ చనిపోతే రూ.5 లక్షలు, కెటిఆర్ చనిపోతే రూ.10 లక్షలు, కవిత చనిపోతే రూ.20 లక్షలు ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కవిత మండిపడ్డారు. ‘‘ఇదేం సంస్కారం అరవింద్! మీలాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైమ్ వచ్చేసింది’’అని అన్నారు.

దీనిపై అరవింద్ తిరిగి స్పందించారు. ‘‘సిఎం కెసిఆర్ కూతురు అయిన మన ఎమ్మెల్సీ ఎన్నడూ ఏ పాపం చేయలే.. రూపాయి కూడా తినలేదు. తెలంగాణను ముంచలేదంటూ’’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా..? మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామని బిఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం ఏంటని నిలదీశారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రి పాలై, బాధితులు లక్షలాది రూపాయలు కడుతున్నా.. ఆరోగ్య శ్రీ ఇచ్చారా? కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భవ ఇచ్చారా? పంటలు నష్టపోతుంటే పరిహారం చెల్లించారా? అని అరవింద్ ప్రశ్నించారు. ఇవన్నీ చేయకుండా రైతు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామనడం ఏంటని నిలదీశారు. ఇవన్నీ మీ దొరబద్ధులకు నిదర్శమని మండిపడ్డారు. అందుకనే మీరు చస్తే బిల్ కుల్ డబ్బులు ఇస్తానని అన్నట్టుగా వివరణ ఇచ్చారు. కెసిఆర్ మేనిఫెస్టోలో పెడితే, బిజెపి కూడా ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెడుతుందన్నారు.

తాను తెలంగాణ ఆడబిడ్డనని కవిత పేర్కొనడం పట్ల కూడా అరవింద్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఆడబిడ్డలు ఇలానే చేస్తారా? అని నిలదీశారు. తాను ఇంట్లో లేనప్పుడు, తన అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇంటికి రౌడీ మూకలను పంపించి దాడి చేయించడాన్ని అరవింద్ ప్రశ్నించారు. అప్పుడు ఏమైంది నీ ఆడుపడుచుదనమంటూ కవితకు కౌంటర్ ఇచ్చారు.