ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన జస్టిస్ లలిత్

ఉదయం 9.30 గంటలకే విచారణలు మొదలు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం

If kids can go to school at 7am, SC can start at 9am: Justice Lalit

న్యూఢిల్లీః ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్. సాధారణంగా సుప్రీంకోర్టులో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో 1-2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమయ పాలనకు భిన్నంగా జస్టిస్ లలిత్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విచారణలు మొదలు పెట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుదాన్షు ధూలియా కూడా ఉన్నారు.

బెయిల్ కేసులో వాదలను వినిపించడానికి వచ్చిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, ధర్మాసనం ముందుగా విచారణలు ప్రారంభించడాన్ని ప్రశంసించారు. ‘‘9.30 గంటలకు అన్నది కోర్టుల ప్రారంభానికి సరైన సమయం అన్నది నా అభిప్రాయం’’ అని రోహత్గి పేర్కొన్నారు.

దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. కోర్టులు ముందుగానే ప్రారంభమవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అని చెప్పారు. ‘‘ఉదయం 9 గంటలకు విచారణ మొదలు పెట్టడం చక్కగా ఉంటుంది. మన పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు, మనం 9 గంటలకు కోర్టును ఎందుకు ప్రారంభించకూడదు? అని నేను తరచుగా చెబుతూనే ఉన్నాను’’ అని పేర్కొన్నారు.

వచ్చే నెల 27న భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవిని జస్టిస్ లలిత్ అలంకరించనున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో కోర్టుల సమయాన్ని అధికారికంగా మారుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/