కేంద్ర విచారణ సంస్థలను నిలదీసిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

మాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలేవని ప్రశ్నించిన కేజ్రీవాల్

if-i-say-i-gave-pm-rs-1000-crore-will-you-arrest-him-asks-arvind-kejriwal

న్యూఢిల్లీః విచారణ సంస్థలపై ఢిల్లీ సిఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా న్యాయస్థానాలకు సమర్పించే అఫిడవిట్లలోనూ అబద్ధాలు పొందుపరుస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలతో తమను వేధింపులకు గురిచేస్తున్న సీబీఐ, ఈడీలపై దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ, ప్రధాని నరేంద్ర మోడీకి సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు నేను వెయ్యి కోట్లు అందించానని చెబితే ఆయనను అరెస్టు చేస్తారా? అంటూ విచారణ సంస్థలను కేజ్రీవాల్ నిలదీశారు.

లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని, 14 ఫోన్లను తాను ధ్వంసం చేశానని విచారణ సంస్థలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. న్యాయస్థానాలకు సమర్పించిన అఫిడవిట్లలో ఈ ఆరోపణలను పొందుపరిచాయని తెలిపారు. అయితే, వాటికి ఎలాంటి ఆధారాలు చూపడంలేదని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారని విచారణ సంస్థల అధికారులపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. తప్పుడు స్టేట్ మెంట్లు సేకరించేందుకు బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ల ఇళ్లు, ఆఫీసులు సోదాలు చేసినా ఒక్క రూపాయిని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఈ స్కాంలో మేం వంద కోట్లు తీసుకున్నామని, వాటిని గోవా ఎన్నికలలో ఖర్చు చేశామని ఆరోపిస్తున్న అధికారులు.. దానికి ఆధారాలు చూపడంలేదేమని నిలదీశారు. గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఖర్చు మొత్తం చెక్కుల రూపంలోనే జరిగిందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.