ప్రిగోజిన్ స్థానంలో నేనుంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటా : బైడెన్ కీలక వ్యాఖ్యలు!

వాగ్నర్ గ్రూప్ చీఫ్‌ ప్రిగోజిన్‌పై విషప్రయోగం జరగొచ్చని బైడెన్ అనుమానం

i’d-be-careful-what-i-eat-biden-jokes-about-wagner-boss-being-poisoned

వాషింగ్టన్‌ః రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్‌ యద్ధంలో పోరాడుతున్న వాగ్నర్‌ గ్రూప్.. జూన్‌ 24న తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. రష్యాలోని ఓ సైనిక కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని.. మాస్కో వైపు అడుగులేసింది. అయితే బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో వివాదం ముగిసింది. ఈ నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ను పుతిన్‌ హత్య చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రిగోజిన్‌పై విషప్రయోగం జరగొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ప్రిగోజిన్ ఎక్కడున్నారో అమెరికాకు తెలీదు. అతడి స్థానంలో నేనుంటే.. నేను తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నా మెనూపై ఓ కన్నేసి ఉంచుతాను” అని చెప్పారు. ‘‘ఇక సరదా మాటలన్నీ పక్కన పెడితే.. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలియదని నేను భావిస్తున్నాను’’ అని చెప్పారు.

ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి. ఆ మధ్య పుతిన్‌ను ఎదిరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ సహా కొందరిపై విషప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బైడెన్ ఇలా స్పందించారు. మరోవైపు జూన్‌ 24 తర్వాత ప్రిగోజిన్ పబ్లిక్‌గా కనిపించకపోవడం గమనార్హం.