HMDA ప్రకటన : బోడుప్పల్‌లో తక్కువ ధరకే ప్లాట్లు

హైదరాబాద్ మహానగరంలో ఇటీవలి కాలంలో వేలం ద్వారా అధిక సంఖ్యలో ప్లాట్లు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్- వరంగల్ నేషనల్ హైవే 163కి దగ్గర్లో ఉన్న లేఅవుట్‌లో ప్లాట్ల అమ్మకాలకు సిద్ధమైంది HMDA . ఉప్పల్‌ భగాయత్‌ తరహాలోనే విశాలమైన రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతులతో ఒకేసారి 234 ఎకరాల స్థలాన్ని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక పనులు పూర్తికాగా, అందులో మొదటి దశలో కొన్ని ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.

పోచారం ఇన్ఫోసిస్ IT సంస్థలతో పాటు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు దగ్గర్లోనే ఈ లేఅవుట్ ఉంది. ఇక అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాట్ల విస్తీర్ణం లేఅవుట్‌లో 266 నుంచి 300 గజాలకు పరిమితం చేయడం విశేషం. ఇక ఈ లేఅవుట్‌లో మొత్తంగా 50 ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఈ- వేలంలో పాల్గొనాలంటే.. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 9వ తేదీన రెండు విడతల్లో ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. జూలై 25న ఉదయం 11 గంటలకు బోడుప్పల్‌లోని సైట్‌లో ఔత్సాహిక కొనుగోలుదారులతో ప్రీ బిడ్‌ సమావేశం ఉంటుందని, ఆ తర్వాత ఆగస్టు 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని, ఒక్కో ప్లాట్లకు నిర్ణయించిన ఈఎండీని చెల్లించాలని సూచించారు.

ఆగస్టు 9న వేలం జరగనుండగా.. 7వ తేదీనే రూ. లక్ష EMD చెల్లించాలి. 9న ఉదయం, సాయంత్రం సెషన్లలో వేలం ప్రక్రియ జరుగుతుంది. ఇక ప్రతి ప్లాట్‌కు చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలుగా నిర్ణయించింది హెచ్‌ఎండీఏ. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. వేలంలో పాల్గొనే వ్యక్తులు ప్రతి చదరపు గజానికి కనీసం రూ.500 చొప్పున పెంచుతూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ ధరకు ఎవరైతే కోట్ చేస్తారో వారికే ప్లాట్ చెందుతుంది. వేలం ముగిసిన తర్వాత 3 విడతల్లో HMDA కు నగదు మొత్తం చెల్లించాలి. తర్వాత ఆ ప్లాట్‌ను సదరు యజమాని పేరుతో రిజిస్టర్ చేయిస్తారు.