800 భూ ప్రకంపనలు… ఐస్ లాండ్ లో ఎమర్జెన్సీ

అగ్నిపర్వతం బద్దలయ్యే ప్రమాదం… ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటున్న అధికారులు

iceland-announced-emergency-after-hundreds-of-tremors-hits-the-nation

రెక్జావిక్‌ః అతి శీతల వాతావరణం నెలకొని ఉండే దేశంగా పేరుగాంచిన ఐస్ లాండ్ ఇప్పుడు వందల సంఖ్యలో భూ ప్రకంపనలతో హడలిపోతోంది. శుక్రవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు 800 సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రకంపనలన్నీ ఒక్క రెక్ జానెస్ ప్రాంతంలోనే సంభవించాయి.

ఐస్ లాండ్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ముఖ్యంగా, గ్రిండ్ విక్ ప్రాంతంలో భూ ప్రకంపనల వల్ల ఓ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. దాంతో గ్రిండ్ విక్ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.

ఐస్ లాండ్ రాజధాని నగరం రెక్ జావిక్ కు కొద్ది దూరంలో 5.2 తీవ్రతతో రెండు ప్రకంపనలు రాగా, రహదారులు ధ్వంసం అయ్యాయి. దాంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, రెక్ జానెస్ ప్రాంతంలో అక్టోబరు నెలాఖరు నుంచి ఇప్పటివరకు 24 వేల ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఐస్ లాండ్ చల్లని దేశమే కాదు, ఇక్కడ అగ్నిపర్వతాల సంఖ్య కూడా ఎక్కువే.