అర్ధరాత్రి హోటల్ సిబ్బందిపై దాడి.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై వేటు

పార్టీకి వెళ్లి వస్తూ రెస్టారెంట్ వద్ద సిబ్బందితో గొడవ

IAS, IPS officers suspended over brawl with restaurant staff in Ajmer

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మేర్ హైవేపై ఓ రెస్టారెంట్ సిబ్బందితో గొడవకు దిగడంతోపాటు వారిపై దాడిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు కారణమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు మొత్తం ఐదుగురిని సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరగ్గా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐఏఎస్ అధికారి అయిన అజ్మేర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరితోపాటు ఓ కానిస్టేబుల్, ఇద్దరు ప్రభుత్వాధికారులపైనా వేటేసి విచారణకు ఆదేశించింది.

గంగాపూర్ సిటీ పోలీస్ విభాగానికి బిష్ణోయ్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాష్‌రూములను ఉపయోగించుకునేందుకు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ బయట వీరు ఆగారు. రెస్టారెంట్‌ను ఓపెన్ చేయమని సిబ్బందిని కోరడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరిపై ఐపీఎస్ అధికారి చేయి చేసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది తిరగబడడంతో ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన ఆయన కాసేపటి తర్వాత పోలీసులతో వచ్చి సిబ్బందిపై దాడిచేశారని, వారిని ఈడ్చిపడేశారని రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఉమేశ్ మిశ్రా తెలిపారు.